హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక అడుగు పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌లో భేటీ అయి ఉద్యమకారుల సంక్షేమంపై కీలక చర్చలు జరిపారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుపై ఈ సమావేశంలో ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మహిళలు మరియు వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు.
అసలైన ఉద్యమకారులను గుర్తించేందుకు జిల్లా వారీగా సర్వే నిర్వహించడం, వారి సమస్యలపై సమగ్ర అధ్యయనం చేయడం, సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడం వంటి అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
త్వరలోనే ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు వెలకట్టలేనివని, అర్హులందరికీ పారదర్శకంగా న్యాయం చేస్తామని నేతలు స్పష్టం చేశారు.
ఈ పరిణామం ఉద్యమకారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది