ఎల్లారెడ్డి, మార్చి 29: కుటుంబ కలహాలు, మద్యం అలవాటు ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. జీవితంపై విరక్తితో ఓ తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మద్యం అలవాటే శాపమై..
పట్టణానికి చెందిన అన్నారం యాదగిరి (53) భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి యాదగిరి మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 26న మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికి వచ్చిన యాదగిరి, డబ్బుల విషయమై తన చిన్న కుమారుడితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరు కుమారులు అతడిని మందలించడంతో మనస్తాపానికి గురైన యాదగిరి అదే రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
గాలింపు.. మృతదేహం లభ్యం
కాగా, ఆదివారం సాయంత్రం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఓ వ్యక్తి దూకడం గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకోగా.. చెరువు గట్టుపై యాదగిరి పర్సు, టవల్ కనిపించాయి. స్థానిక గజ ఈతగాళ్ల సాయంతో గాలించగా యాదగిరి మృతదేహం లభ్యమైంది.
పోలీసుల విచారణ
తల్లి మరణం తర్వాత తండ్రి మద్యానికి బానిసయ్యాడని, జీవితంపై విరక్తితోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని పెద్ద కుమారుడు మణికంఠ చారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గమనిక: ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. మానసిక ఒత్తిడి లేదా ఇతర సమస్యలతో బాధపడుతుంటే నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.