కళ్లముందే చేతికొచ్చే పంట నాశనం.. విలపిస్తున్న రైతన్న
బొంపల్లిలో వందలాది ఎకరాల్లో నష్టం.. పరిహారం అందించాలి: పడిగెల రాజేశ్వరరావు
సదాశివనగర్, మార్చి 26: అకాల వర్షం అన్నదాతను నిలువునా ముంచింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట, కోతకు వస్తుందనుకున్న తరుణంలో ప్రకృతి ప్రకోపానికి గురైంది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామంలో కురిసిన వడగండ్ల వానకు వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైంది.
చేతికందే వేళ.. తీరని శోకం మరో 20 రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట కళ్లముందే నేలపాలవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒక్క బొంపల్లి గ్రామంలోనే దాదాపు 100 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి వేల రూపాయల పెట్టుబడి పెట్టి, అప్పులు తెచ్చి సాగు చేస్తే.. ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
తక్షణమే సర్వే చేపట్టాలి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఉమ్మడి సదాశివనగర్ మండల మాజీ జెడ్పీటీసీ పడిగెల రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొంపల్లితో పాటు మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి పంపాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని విన్నవించారు.