హైదరాబాద్ (మేడిపల్లి), V59 News: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బీటెక్ విద్యార్థిని బానోత్ నందిని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర లైవ్ అధ్యక్షులు డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదువులో రాణిస్తూ, ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించిన ఒక గిరిజన బిడ్డ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన డా. రాజ్‌కుమార్: ఘటన విషయం తెలియగానే డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ స్పందించి, గాంధీ ఆసుపత్రిలో ఉన్న నందిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కేవలం పరామర్శించడమే కాకుండా, పోస్ట్‌మార్టం ప్రక్రియను త్వరగా పూర్తి చేయించి, మృతదేహాన్ని వారి స్వగ్రామమైన దేవుని తండాకు తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని స్వయంగా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వానికి మరియు పోలీసులకు డిమాండ్: ఈ సందర్భంగా డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ మాట్లాడుతూ.. “నందిని ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కారణాలను పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలి. ఎవరైనా ఆమెను వేధించారా లేదా మరేదైనా ఒత్తిడి ఉందా అనే కోణంలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. అలాగే, రెక్కాడితే గానీ డొక్కాడని ఆ గిరిజన కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం ప్రకటించి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.