రంజాన్ పర్వదినం ఐక్యతకు, సహనానికి మరియు సేవాభావానికి ప్రతీక అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. గురువారం బిచ్కుంద మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే, అనంతరం వారితో కలిసి ఉపవాస దీక్షను విరమించారు.
మైనారిటీల సంక్షేమమే ధ్యేయం అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మైనారిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మండలంలోని నిరుపేద ముస్లిం కుటుంబాల స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని, వారందరికీ ప్రాధాన్యత క్రమంలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గూడు లేని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మైనారిటీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.