IMG-20260316-WA0039

ఎల్లారెడ్డి చెరువులో యువకుడి మృతదేహం.. గ్రామంలో విషాదం

కామారెడ్డి యెల్లారెడ్డి నియోజకవర్గం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు నివాసి చిట్యాల దుర్గేందర్ మృతదేహం సోమవారం ఉదయం ఎల్లారెడ్డి పెద్ద చెరువులో లభ్యమైంది. శనివారం నుంచి అదృశ్యమైన దుర్గేందర్ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతుండగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
మృతుడి అన్న పరందాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి పోలీసులు ఆదివారం మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా సోమవారం ఉదయం పెద్ద చెరువులో మృతదేహం కనిపించినట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం దుర్గేందర్‌దేనని నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఫిర్యాదుదారుడు, సాక్షుల వాంగ్మూలాల ప్రకారం మృతుడికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లింగారెడ్డిపేట గ్రామానికి వచ్చి ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద బస్సు దిగిన అనంతరం పెద్ద చెరువు వైపు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నట్లు ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దుర్గేందర్ ఆకస్మిక మృతితో లింగారెడ్డిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *