ఎల్లారెడ్డి మండలంలో పకడ్బందీగా ఏర్పాట్లు: ఎంఈఓ రాజులు
పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎస్ఐ మహేష్
ఎల్లారెడ్డి: మండల వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు నిర్వహించిన తెలుగు మొదటి పేపర్ పరీక్షకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. మండలంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, నిబంధనల ప్రకారం పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి (ఎంఈఓ) రాజులు వెల్లడించారు.
అధికారుల ఆకస్మిక తనిఖీలు పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్ మరియు ఎస్ఐ బొజ్జ మహేష్ పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా గదుల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను వారు పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘాలో, ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో పరీక్షలు పారదర్శకగా జరుగుతున్నాయని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
నిబంధనల అమలు – పోలీసు బందోబస్తు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, బయటి వ్యక్తులు ఎవరూ లోపలికి రాకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించినట్లు పేర్కొన్నారు.
తొలిరోజు పరీక్ష రాసిన విద్యార్థులు పేపర్ సులభంగానే ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది, రెవెన్యూ అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు